లేవీయకాండము
అధ్యాయం 24
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపముకొరకు దంచితీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము.
ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను. ఇది మీ తర తరములకు నిత్యమైన కట్టడ.
అతడు నిర్మలమైన దీపవృక్షముమీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను.
నీవు గోధుమలపిండిని తీసికొని దానితో పండ్రెండు భక్ష్యములను వండవలెను. ఒక్కొక్క భక్ష్యమున సేరు సేరు పిండి యుండవలెను.
యెహోవా సన్నిధిని నిర్మలమైన బల్లమీద ఆరేసి భక్ష్యములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలెను.
ఒక్కొక్క దొంతిమీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను. అది యెహోవా యెదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును.
యాజకుడు ప్రతి విశ్రాంతిదినమున నిత్య నిబంధననుబట్టి ఇశ్రాయేలీయులయొద్ద దాని తీసికొని నిత్యము యెహోవా సన్నిధిని చక్కపరచవలెను.
అది అహరోనుకును అతని సంతతివారికి ఉండవలెను. వారు పరిశుద్ధస్థలములో దాని తినవలెను. నిత్యమైన కట్టడచొప్పున యెహోవాకు చేయు హోమములలో అది అతిపరిశుద్ధము.
ఇశ్రాయేలీయురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడగు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను.
ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషేయొద్దకు వాని తీసికొనివచ్చిరి. వాని తల్లిపేరు షెలోమీతు; ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె
యెహోవా యేమి సెలవిచ్చునో తెలిసికొనువరకు వానిని కావలిలో ఉంచిరి.
అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
శపించినవానిని పాళెము వెలుపలికి తీసికొనిరమ్ము; వాని శాపవచనమును వినినవారందరు వాని తలమీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాని చావగొట్టవలెను.
మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలెను.
యెహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలెను; సర్వసమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను. పరదేశియేగాని స్వదేశియేగాని యెహోవా నామమును దూషించినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసినయెడల వానికి మరణశిక్ష విధింపవలెను.
జంతు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకొనవలెను.
ఒకడు తన పొరుగువానికి కళంకము కలుగజేసినయెడల వాడు చేసినట్లు వానికి చేయవలెను.
విరుగగొట్టబడిన దాని విషయములో విరుగగొట్టబడుటయే శిక్ష. కంటికి కన్ను పంటికి పల్లు, చెల్లవలెను. వాడు ఒకనికి కళంకము కలుగజేసినందున వానికి కళంకము కలుగజేయవలెను.
జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలెను. నరహత్య చేసినవానికి మరణశిక్ష విధింపవలెను.
మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలెను. మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికిని చేయవలెను. నేను మీ దేవుడనైన యెహోవానని వారితో చెప్పుము అనెను.
కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో ఈలాగు చెప్పెను శపించిన వానిని పాళెము వెలుపలికి తీసికొనిపోయి రాళ్లతో వాని చావగొట్టవలెను, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేసిరి.