లూకా
అధ్యాయం 3
తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను,
అన్నయు, కయపయు ప్రధాన యాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను.
అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను.
ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళము చేయుడి
ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును
సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను.
అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?
మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను.
అందుకు జనులు ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా
అతడు రెండు అంగీలు గలవాడు ఏమియు లేనివానికియ్యవలెననియు, ఆహారము గలవాడును ఆలాగే చేయవలెననియు వారితో చెప్పెను.
సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా
అతడు మీకు నిర్ణయింపబడిన దానికంటె ఎక్కువ తీసికొనవద్దని వారితో చెప్పెను.
సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడు ఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొంది యుండుడని వారితో చెప్పెను.
ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానునుగూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా
యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును;
ఆయన చేట ఆయన చేతిలో నున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రము చేసి, తన కొట్టులో గోధుమలు పోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను.
ఇదియు గాక అతడింకను, చాల సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను.
అయితే చతుర్థాధిపతియైన హేరోదు చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్యయైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు
అదివరకు తాను చేసినవన్నియు చాలవన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.
ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి
పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశము నుండి వచ్చెను.
యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడు గలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి,
హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి,
మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి,
నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు,
యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి,
నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు,
ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి,
లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు,
ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు,
దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,
నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,
యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు,
నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,
షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు,
కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.