యోహాను
అధ్యాయం 18
యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతోకూడ కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట యుండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతోకూడ వెళ్లెను.
యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్లుచుండువాడు గనుక, ఆయనను అప్పగించు యూదాకును ఆ స్థలము తెలిసియుండెను.
కావున యూదా సైనికులను, ప్రధానయాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకొని, దివిటీలతోను దీపములతోను ఆయుధములతోను అక్కడికి వచ్చెను.
యేసు తనకు సంభవింపబోవునవన్నియు ఎరిగినవాడై వారియొద్దకు వెళ్లి మీరెవని వెదకుచున్నారని వారిని అడిగెను.
వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను; ఆయనను అప్పగించిన యూదాయు వారియొద్ద నిలుచుండెను.
ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేలమీదపడిరి.
మరల ఆయన మీరు ఎవనిని వెదకుచున్నారని వారిని అడిగెను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా
యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకుచున్నయెడల వీరిని పోనియ్యుడని చెప్పెను.
నీవు నాకు అనుగ్రహించినవారిలో ఒకనినైనను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు చెప్పెను.
సీమోను పేతురునొద్ద కత్తి యుండినందున అతడు దానిని దూసి, ప్రధానయాజకుని దాసుని కొట్టి అతని కుడిచెవి తెగనరికెను.
ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి ఒరలో ఉంచుము; తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను.
అంతట సైనికులును సహస్రాధిపతియు, యూదుల బంట్రౌతులును యేసును పట్టుకొని ఆయనను బంధించి, మొదట అన్నయొద్దకు ఆయనను తీసికొనిపోయిరి.
అతడు ఆ సంవత్సరము ప్రధానయాజకుడైన కయపకు మామ.
కయప ఒక మనుష్యుడు ప్రజలకొరకు చనిపోవుట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు.
సీమోను పేతురును మరియొక శిష్యుడును యేసు వెంబడి పోవుచుండిరి. ఆ శిష్యుడు ప్రధానయాజకునికి నెళవైనవాడు గనుక అతడు ప్రధానయాజకుని యింటి ముంగిటిలోనికి యేసుతో కూడ వెళ్లెను.
పేతురు ద్వారమునొద్ద బయట నిలుచుండెను గనుక ప్రధానయాజకునికి నెళవైన ఆ శిష్యుడు బయటికివచ్చి ద్వారపాలకురాలితో మాటలాడి పేతురును లోపలికి తోడుకొనిపోయెను.
ద్వారమునొద్ద కావలియున్న యొక చిన్నది పేతురుతో నీవును ఈ మనుష్యుని శిష్యులలో ఒకడవు కావా? అని చెప్పగా అతడు కాననెను.
అప్పుడు చలివేయుచున్నందున దాసులును బంట్రౌతులును మంటవేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలువబడి చలి కాచుకొనుచుండెను.
ప్రధానయాజకుడు ఆయన శిష్యులను గూర్చియు ఆయన బోధను గూర్చియు యేసును అడుగగా
యేసు నేను బాహాటముగా లోకము ఎదుట మాటలాడితిని; యూదులందరు కూడివచ్చు సమాజమందిరములలోను దేవాలయములోను ఎల్లప్పుడును బోధించితిని; రహస్యముగా నేనేమియు మాటలాడలేదు.
నీవు నన్ను అడుగనేల? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము; ఇదిగో నేను చెప్పినది వీరెరుగుదురని అతనితో అనెను.
ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలొ ఒకడు ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను.
అందుకు యేసు నేను కానిమాట ఆడినయెడల ఆ కానిమాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడినయెడల నన్నేల కొట్టుచున్నావనెను.
అంతట అన్న, యేసును బంధింపబడి యున్నట్టుగానే ప్రధానయాజకుడైన కయపయొద్దకు పంపెను.
సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడవుకావా? అని చెప్పగా అతడు నేను కాను, నేనెరుగననెను.
పేతురు ఎవని చెవి తెగనరికెనో వాని బంధువును ప్రధానయాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితొ కూడ ఉండగా నేను చూడలేదా? అని చెప్పినందుకు
పేతురు నేనెరుగనని మరియొకసారి చెప్పెను; వెంటనే కోడి కూసెను.
వారు కయపయొద్దనుండి అధికారమందిరమునకు యేసును తీసికొనిపోయిరి. అప్పుడు ఉదయమాయెను గనుక వారు మైలపడకుండ పస్కాను భుజింపవలెనని అధికారమందిరములోనికి వెళ్లలేదు.
కావున పిలాతు బయట ఉన్న వారియొద్దకు వచ్చిఈ మనుష్యునిమీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను.
అందుకు వారు వీడు దుర్మార్గుడు కానియెడల వీనిని నీకు అప్పగించియుండమని అతనితో చెప్పిరి.
పిలాతు మీరతని తీసికొనిపోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పుతీర్చుడనగా
యూదులు ఎవనికిని మరణశిక్ష విధించుటకు మాకు అధికారము లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరెను.
పలాతు తిరిగి అధికారమందిరములో ప్రవేశించి యేసును పిలిపించి యూదుల రాజువు నీవేనా? అని ఆయననడుగగా
యేసు నీ అంతట నీవే యీ మాట అనుచున్నావా? లేక యితరులు నీతో నన్నుగూర్చి చెప్పిరా? అని అడిగెను.
అందుకు పిలాతు నేను యూదుడనా యేమి? నీ స్వజనమును ప్రధానయాజకులును నిన్ను నాకు అప్పగించిరి గదా; నీవేమి చేసితివని అడుగగా
యేసు నా రాజ్యము ఈ లోకసంబంధమైనది కాదు; నా రాజ్యము ఈ లోకసంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహసంబంధమైనది కాదనెను.
అందుకు పిలాతు నీవు రాజువా? అని ఆయనను అడుగగా యేసు నీవన్నట్టు నేను రాజునే; సత్యమునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని; ఇందు నిమిత్తమే యీ లోకమునకు వచ్చితిని; సత్యసంబంధియైన ప్రతివాడును నా మాట వినుననెను
అందుకు పిలాతు సత్యమనగా ఏమిటి? అని ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదులయొద్దకు తిరిగివెళ్లి అతనియందు ఏ దోషమును నాకు కనబడలేదు;
అయినను పస్కాపండుగలో నేనొకని మీకు విడుదల చేయువాడుక కలదు గదా; నేను యూదుల రాజును విడుదల చేయుట మీకిష్టమా? అని వారినడిగెను.
అయితే వారు వీనిని వద్దు, బరబ్బను విడుదల చేయుమని మరల కేకలువేసిరి. ఈ బరబ్బ బందిపోటు దొంగ.