పవిత్ర గ్రంథాలు

1రాజులు

అధ్యాయం 1

రాజైన దావీదు బహు వృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్నిబట్టలు కప్పినను అతనికి వెట్ట కలుగకయుండెను.

కాబట్టి వారు మా యేలినవాడవును రాజవునగు నీకొరకు తగిన చిన్నదాని వెదకుట మంచిది; ఆమె రాజైన నీ సముఖమందుండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనునని చెప్పి

ఇశ్రాయేలీయుల దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెదకి, అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసికొనివచ్చిరి.

ఈ చిన్నది బహు చక్కనిదై యుండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు.

హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించినవాడై నేనే రాజునగుదునని అనుకొని, రథములను గుఱ్ఱపు రౌతులను తనకు ముందుగా పరుగెత్తుటకు ఏబదిమంది మనుష్యులను ఏర్పరచుకొనెను.

అతని తండ్రి నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతనిచేత ఎప్పుడును విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తరువాత పుట్టినవాడు.

అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోను యాజకుడైన అబ్యాతారుతోను ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని

యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.

అదోనీయా ఏన్‌రోగేలు సమీపమందుండు జోహెలేతు అను బండదగ్గర గొఱ్ఱలను ఎడ్లను క్రొవ్విన దూడలను బలిగా అర్పించి, రాజకుమారులగు తన సహోదరులనందరిని యూదావారగు రాజు యొక్క సేవకులనందరిని పిలిపించెను గాని

ప్రవక్తయగు నాతానును బెనాయనును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు.

అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబతో చెప్పినదేమనగా హగ్గీతు కుమారుడైన అదోనీయా యేలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన యేలినవాడైన దావీదునకు తెలియకయే యున్నది.

కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను వినుము.

నీవు రాజైన దావీదునొద్దకు పోయినా యేలినవాడా, రాజా, అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని నీ సేవకురాలనైన నాకు నీవు ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చితివే; అదోనీయా యేలుచుండుట యేమని అడుగవలెను.

రాజుతో నీవు మాటలాడుచుండగా నేను నీవెనుక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పెను.

కాబట్టి బత్షెబ గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహు వృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను.

బత్షెబ వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె యీలాగు మనవి చేసెను

నా యేలిన వాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైన నాకు ప్రమాణము చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనము మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే,

ఇప్పుడైతే అదోనీయా యేలుచున్నాడు. ఈ సంగతి నా యేలినవాడవును రాజవునగు నీకు తెలియకయే యున్నది.

అతడు ఎడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని యాజకుడైన అబ్యాతారును సైన్యాధిపతియైన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోనును పిలువలేదు.

నా యేలినవాడవైన రాజా, నా యేలినవాడవైన రాజవగు నీ తరువాత సింహాసనము మీద ఎవడు ఆసీనుడగునో అందునుగూర్చి ఇశ్రాయేలీయులందరును కనిపెట్టియున్నారు.

ఇదిగాక నా యేలినవాడవైన రాజవగు నీవు నీ పితరులతోకూడ నిద్రపొందిన తరువాత నేనును నా కుమారుడైన సొలొమోనును అపరాధులముగా ఎంచబడుదుము.

ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికిరాగా ప్రవక్తయగు నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి.

అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి

నా యేలినవాడవైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనముమీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా?

ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన యెడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనీయా చిరంజీవియగునుగాక అని పలుకుచున్నారు.

అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు.

నా యేలినవాడవును రాజవునగు నీ తరువాత నీ సింహాసనముమీద ఎవడు ఆసీనుడైయుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా యేలినవాడవును రాజవునగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా? అని యడిగెను.

దావీదు బత్షెబను పిలువుమని సెలవియ్యగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలువబడెను.

అప్పుడు రాజు ప్రమాణ పూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలోనుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు

అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనము మీద ఆసీనుడగునని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసినదానిని ఈ దినముననే నెరవేర్చుదునని చెప్పగా

బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను.

అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి.

అంతట రాజు మీరు మీ యేలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి

యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని ప్రకటన చేయవలెను.

ఇశ్రాయేలు వారిమీదను యూదావారి మీదను నేనతనిని అధికారిగా నియమించియున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముమీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను.

అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను ఆలాగు జరుగును గాక, నా యేలినవాడవును రాజవునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక.

యెహోవా నా యేలినవాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను;

కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయులును రాజైన దావీదు కంచర గాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొనిరాగా

యాజకుడైన సాదోకు గుడారములోనుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరును రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని కేకలువేసిరి

మరియు ఆ జనులందరును అతని వెంబడివచ్చి పిల్లనగ్రోవులను ఊదుచు, వాటి నాదముచేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి.

అదోనీయాయును అతడు పిలిచిన వారందరును విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. యోవాబు బాకానాదము విని పట్టణమునందు ఈ అల్లరి యేమని యడుగగా

యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనీయా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా

యోనాతాను అదోనీయాతో ఇట్లనెను నిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా నియమించియున్నాడు.

రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయానును కెరేతీయులను పెలేతీయులను అతనితోకూడ పంపగా వారు రాజు కంచర గాడిదమీద అతని నూరేగించిరి;

యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును గిహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి; అక్కడనుండి వారు సంతోషముగా వచ్చియున్నారు; అందువలన పట్టణము అల్లరి ఆయెను; మీకు వినబడిన ధ్వని యిదే.

మరియు సొలొమోను రాజ్యాసనముమీద ఆసీనుడైయున్నాడు;

అందుకై రాజు సేవకులు మన యేలినవాడును రాజునగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి, నీకు కలిగిన ఖ్యాతి కంటె సొలొమోనునకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును, నీ రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయును గాక అని చెప్పగా రాజు మంచముమీద సాగిలపడి నమస్కారము చేసి యిట్లనెను

నేను సజీవినై యుండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనముమీద ఆసీనుడగుటకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఒకని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను.

అందుకు అదోనీయా పిలిచినవారు భయపడి లేచి తమ తమ యిండ్లకు వెళ్లిపోయిరి.

అదోనీయా సొలొమోనునకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను.

అదోనీయా రాజైన సొలొమోనునకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోను తన సేవకుడనైన నన్ను కత్తిచేత చంపకుండ ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెనని మనవి చేయుచున్నట్లు సొలొమోనునకు సమాచారము రాగా

సొలొమోను ఈలాగు సెలవిచ్చెను అతడు తన్ను యోగ్యునిగా అగుపరచుకొనినయెడల అతని తల వెండ్రుకలలో ఒకటైనను క్రిందపడదు గాని అతనియందు దౌష్ట్యము కనబడినయెడల అతనికి మరణశిక్ష వచ్చునని సెలవిచ్చి

బలిపీఠమునొద్దనుండి అతని పిలువనంపించెను; అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగపడగా సొలొమోను అతనితో నీ యింటికి పొమ్మని సెలవిచ్చెను.