మార్కు
అధ్యాయం 2
కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చెను
ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా
కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొనివచ్చిరి.
చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువు గలవానిని పరుపుతోనే దింపిరి.
యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను.
శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి.
వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.
వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?
ఈ పక్షవాయువు గలవానితో నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా?
అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి
పక్షవాయువు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.
తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచిపోయెను గనుక, వారందరు విభ్రాంతినొంది మనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను.
ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను.
అతని యింట ఆయన భోజనమునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండియుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబడించువారైరి
పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచి ఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా
యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను.
యోహాను శిష్యులును పరిసయ్యులును ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చి యోహాను శిష్యులును పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయన నడుగగా
యేసు పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయదగునా? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని
పెండ్లికుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలోనే వారుపవాసము చేతురు.
ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసికవేయడు; వేసినయెడల ఆ క్రొత్తమాసిక పాతబట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును.
ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను.
మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచునుండిరి.
అందుకు పరిసయ్యులు చూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయుచున్నారని ఆయన నడిగిరి.
అందుకాయన వారితో ఇట్లనెను తానును తనతో కూడ నున్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా?
అబ్యాతారు ప్రధానయాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులేగాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, తనతోకూడ ఉన్నవారికిచ్చెనుగదా అని చెప్పెను.
మరియు విశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినము కొరకు నియమింపబడలేదు.
అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువైయున్నాడని వారితో చెప్పెను.